Sunday, August 1, 2021

*భయపడకండి దిగులుపడకుడి*

భయపడటం, చింతించడం, జడియటం, దిగులుపడటం ఇవన్నీ నిస్సహాయ స్థితిలో

నుండి పుట్టుకొస్తాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇవన్నీ ఎదురవుతాయి.

పేద గొప్ప, బలవంతుడు బలహీనుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇవి

ఎదురవుతుంటాయి. ఇవే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవు

తుంటాయి. వీటిని ఎదుర్కోడానికి, భరించడానికి, బెంబేలెత్తకుండా ధైర్యంగా ఉండటానికి

మన దగ్గరున్న ఆయుధం ఏమిటి? ఒకవేళ మనిషికి వీటిని ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు

ఉన్నట్లయితే ఏ మనిషికి దేవునితో అవసరం ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకు

కొన్ని కష్టాలు, బాధలు పెట్టి మనల్ని పరీక్షిస్తాడు. అవన్నీ తాత్కాలికమే. మన కష్టాల్లో,

బాధల్లో మనం దేవుని మీద ఆధారపడాలన్న ఉద్దేశ్యంతో దేవుడు మనల్ని పరీక్షిస్తాడే

తప్ప మనల్ని శిక్షించడానికి కాదు. 'దేవుడు నమ్మదగిన వాడు; మీరు సహింప

గలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు,

సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును”

(1కొరింథీ. 10:13). మన జీవితంలో మనకు ఎన్నో బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు

మనం దేవుని వైపు చూడాలని, వాటిని తొలగించడానికి తగిన పరిష్కారముతో ఆయన

ఎదురుచూస్తుంటాడు. మనమేమో మన స్వంత ప్రయత్నాలు చేస్తుంటాము. తద్వారా

అవి పరిష్కారమవ్వకపోగా ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. మన కష్టాలను బాధలను

దేవుడు గోటితో తీసేసే లోపే మనం గొడ్డలి తీస్తాము. అసలు మన కష్టాలను,

బాధలను పరిష్కరించే అవకాశమే దేవునికి ఇవ్వము. మనమూ పరిష్కరించుకోలేక,

దేవునికి అవకాశం ఇవ్వక పోవడం వలన మన కష్టాలు ఎక్కువకాలం మనతోనే

ఉంటాయి. మనకొచ్చే కష్టాలు, బాధలు ఏముంటాయి? ఆర్ధికపరమైన, కుటుంబ

పరమైనవే ఉంటాయి. ఇలాంటి కష్టాలన్నీ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కాకపోతే

మనమేమనుకుంటామంటే, ప్రపంచంలో కష్టాలన్నీ, బాధలన్నీ నాకే ఉన్నాయి అనుకొని

ఎక్కువగా బాధపడతాము. మనకంటే దారుణమైన కష్టాలు, బాధలుపడే వారు

ఎంతోమంది ఉన్నారు. తినడానికి తిండిలేక, ఉండటానికి ఇల్లులేక, కట్టుకోడానికి

బట్టలేక, రోగాలతో బాధపడేవాళ్ళ కష్టాల కంటే మన కష్టాలని భూతద్దంలో చూస్తాము

కాబట్టి మనం భయపడతాము, దిగులుపడతాము. మనం భయపడినప్పుడు,

దిగులుపడినప్పుడు 'నాతో కూడ వచ్చువాడు నా దేవుడైన యెహోవాయే ఆయన

నన్ను విడువడు నన్నెడబాయడు' అని ధైర్యంగా ఉందాము.

ప్రభువా! ఈ లోకములో మేము జీవించినంత కాలము ఏ విషయము గురించి

అయినా భయపడకుండా, దిగులుపడకుండా జీవించే మనసు మాకు దయచేయమని

యేసునామమున అడుగుచున్నాము తండ్రీ! ఆమేన్!!!

*మనిషి యొక్క గర్వ హృదయము*

కొంతమందిని చూచినప్పుడు వాళ్ళు చాలా గర్విష్టివాళ్ళు అనుకుంటాము. కొంత

మందిని చూచినప్పుడు చాలా సౌమ్యులు, మృదుస్వభావము కలిగినవాళ్ళు అను

కుంటాము. కాలక్రమంలో మన అంచనా తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే గర్వము

అనేది హృదయమునకు సంబంధించినది. ఎదుటివాళ్ళు మంచివాళ్ళా చెడ్డ వాళ్ళా

అనేది మనం క్షణాల్లో తేల్చలేము. ఎవరి హృదయాన్ని మనం పరిశీలించలేము,

పరిశోధించలేము. కేవలం దేవుడు మాత్రమే హృదయాలను పరిశోధించగలడు.

'హృదయ పరిశోధకుడు యెహోవాయే' (సామెతలు 17:3). ఎదుటి వారి ప్రవర్తననుబట్టి

వారు గర్విష్టివాళ్ళని మనం తేలిగ్గా అంచనా వేయకూడదు. కొంతమందికి రోషము

ఉంటుంది.

దావీదు సైన్యంలో ఉన్న తన అన్నలని చూడటానికి వెళ్ళినప్పుడు గొల్యాతు

గురించి తెలిసి దావీదుకి చాలా రోషం వస్తుంది. 'జీవముగల దేవుని సైన్యములను

తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిప్తీయుడు ఎంతటివాడు?” అని దేవున్నిబట్టి

దావీదుకు ఎక్కడలేని రోషం వస్తుంది. కాని వాళ్ళ అన్నయైన ఏలీయాబు 'నీ గర్వమును

నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును' అని తిడతాడు. కొంతమందికి ఆత్మాభి

మానం ఉంటుంది. వాళ్ళు తొందరపడి ఎదుటివారిని బాధపెట్టినప్పుటికీ హృదయంలో

పశ్చాత్తాపపడతారు. కాబట్టి ఎదుటి వారి గర్వాన్ని మనం నిర్ణయిస్తే మనం గర్వించిన

వారమవుతాము.

చాలామంది తమకున్న ఆధిక్యతలనుబట్టి గర్విస్తారు. డబ్బు, హోదా,

చదువు, అందం ఇవన్నీ మనుష్యులు గర్వించడానికి కారణమవుతాయి. పైకి కనిపించక

పోయినప్పటికీ హృదయంలో గర్వముంటుంది. ఏది ఉన్నా, ఏది లేక పోయినా దేవుడంటే

భయము, భక్తి లేని వారందరికీ గర్వహృదయముంటుంది. హృదయంలో గర్వించే వారు

మాత్రమే దేవున్ని, మనుష్యులను లెక్క చెయ్యరు. ఎదుటివారి పట్ల ప్రేమ, జాలి, దయ

లేకుండా ప్రవర్తిస్తారు. గర్వించడమన్నది సాతాను యొక్క గుణం. హృదయంలో గర్వించి

దేవునితో సమానంగా తనను తాను హెచ్చించుకున్నప్పుడు దేవుడు దానిని పాతాళంలోకి

నెట్టివేశాడు. గర్వహృదయులను చూస్తే దేవునికి చాలా అసహ్యం. వారికి తప్పనిసరిగా

శిక్ష వస్తుంది.

రాజైన నెబుకద్నెరు తన హృదయంలో గర్వించినప్పుడు దేవుడు శిక్షించినట్లే,

ఎవరు గర్వించినా శిక్ష నుండి తప్పించుకోలేరు. కాబట్టి మనల్ని నాశనం చేసే

గర్వము మన హృదయంలో ఉండకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యము

ఉంచుకొని దేవునియందలి వినయ విధేయతలతో జీవించాలి. 'ఎవని గర్వము

వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనతనొందును' (సామెతలు 16:18).

ప్రభువా! ఈ లోకంలో మేము జీవించుచున్నప్పుడు గర్వించే హృదయముతో

కాకుండా నీయందు వినయ విధేయతలతో జీవించునట్లు మాకు సహాయం

దయచేయుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి! ఆమేన్!!

*మొదట దేవునియందు కృతజ్ఞత కలిగియుండాలి*

ఎదుటి వాళ్ళు మనకు చేసే మేలునుబట్టి వారిపట్ల ఎంత వరకు కృతజ్ఞత కలిగి

ఉండాలో మనం నిర్ణయించుకుంటాం. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటాం.

పెద్ద సహాయం చేస్తే కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం. ఒక ఉద్యోగం ఇప్పిస్తేనో,

పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తేనో వారిపట్ల జీవితాంతం కృతజ్ఞతాభావం కలిగి

వుంటాము. ఇదంతా మనుష్యుల ద్వారా పొందే సహాయానికి కృతజ్ఞత చూపించటం.

అయితే దేవుని పట్ల మనం ఏ విషయంలో కృతజ్ఞత చూపించాలి? ఆయన ఏమి

ప్రత్యక్షంగా కనబడి ఒక మనిషిలాగా ఎలాంటి సహాయం చేయడు కదా అనుకోవచ్చు.

మనం సంపాదించుకోగలిగిన దానిని లేదా మనుష్యుల ద్వారా మనం పొందగలిగిన

దానిని దేవుడు మనకి ఇవ్వవలసిన అవసరం లేదు. మన తెలివితేటలతో, డబ్బుతో,

మనుష్యుల ద్వారా పొందలేని దానిని దేవుడు మనకి ఇస్తాడు. అదే పరిపూర్ణ ఆరోగ్యం.

'చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు

కలిగినది యావత్తును నరుడిచ్చును గదా' (యోబు 2:4) అని యోబు విషయంలో

సాతాను చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటంటే ఆరోగ్యం ఉంటే మనిషి ఏమైనా చేయగలడు

అని అర్ధం. అంటే మనిషి ఏమి చేయాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే చెయ్యగలడు.

ఆరోగ్యం లేనప్పుడు ఏ పని చేయ్యలేడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది

గ్రేట్ అనారోగ్యంతో చనిపోయాడంటే, తన ప్రాణాన్ని నిలుపుకోడానికి అతని శక్తి,

అతని ఆస్తి అక్కరకు రాలేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతులైనా తన ఆస్తినంతా

రాసిచ్చినా ఏ డాక్టరు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. కేవలం దేవుడు మాత్రమే ఎవరికైనా

పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలడు. 'నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను

మాన్పెదను' (యిర్మీయా 30:17). మనం ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతున్నా

మంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. ధనవంతులని చెప్పుకొనే వారు ఆస్తులు

కూడబెట్టుకోగలుగుతున్నా, పెద్ద పెద్ద చదువులు చదివి, ఉద్యోగం సంపాదించి జీతాలు

సంపాదిస్తుతున్నా అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. మనకి సహాయపడే వారు స్వార్ధంతో

సహాయం చేస్తారేమో కాని, నిస్వార్ధంగా, షరతులు లేకుండానే మనకి ఆరోగ్యం దయచేసే

దేవునిపట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తే ఆ ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోతుంది.

మనకి ఆరోగ్యం దయచేసిన దేవునిపట్ల జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉందాము.

ఒకవేళ మీరు ఆనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం దయచేయమని దేవున్ని వేడుకోండి.

ప్రభువా, ఈ లోకంలో మేము జీవించడానికి నీవు మాకు దయచేసిన ఆరోగ్యమే

కారణమని గుర్తెరిగి నీ పట్ల కృతజ్ఞతతో జీవించేలా మాకు సహాయం దయచేయుమని

యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

*అవసరమైనది ఒక్కటే దేవుని సన్నిధి*

యేసు బోధల ప్రకారం మనం జీవించలేకపోవడానికి కారణం ఆయన చెప్పేవి మనకి అర్ధం కాకపోవడం. అర్ధం కాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పే వాటికి పూర్తి భిన్నంగా మన ఆలోచనలు, మన జీవితము ఉంటుంది.

అందుకే ఒక పట్టాన మనకి అర్ధం కావు, ఒకవేళ అర్ధమైనా, వాటిని అనుసరించలేము.

ఇంతపెద్ద ప్రపంచంలో, ఎన్నో రంగులు, హంగులూ, ఆర్భాటాలు, స్నేహాలు,

బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఈ లోకాన్నుండి మనల్ని విడదేయలేని

ఇంకా ఎన్నిటినో కాదని 'అవసరమైనది ఒక్కటే' అని చెప్పగానే 'ఓకే' చెప్పడానికి

మనమేమన్నా పిచ్చోళ్ళమా? ఇలాంటి ఆచరణ సాధ్యం కాని బోధ చేస్తున్నాడనే

కదా ఆయన ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులు కాకుండా ఆయనను

వెంబడించే శిష్యులలో కొంతమంది ఆయనను వదిలేసి పారిపోయి మళ్ళీ ఆయన

దగ్గరకు రాలేదు. 'అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి

ఎన్నడును ఆయనను వెంబడింపలేదు' (యోహాను 6:66). అప్పుడు యేసు తన

శిష్యులను కూడా అడిగాడు 'మీరు కూడా వెళ్ళిపోవలెనని యున్నారా?” అని. ఇదే

ప్రశ్న దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు 'నేను చెప్పేది ఆచరించలేక మీరు

కూడా వెళ్ళిపోతారా?” అని. బాగా ఆలోచించి సమాధానం చెప్పాల్సింది మనమే.

'అవసరమైనది ఒక్కటే, అదే దేవుని సన్నిధి' మరియ ఎంచుకున్న 'ఉత్తమమైనది'

'యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన

105:4).

వెదకటమంటే మనం చేయాల్సిన పనులన్నీ మానేసి ఏ చర్చీలోనో, ఇంట్లో ఒక మూల కూర్చొని బైబిలు చదువుతూనో, ప్రార్ధన చేసుకుంటూ ఉండటమో కాదు

గానీ, మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మన హృదయములో, మన

ఆలోచనలలో దేవుని గూర్చి తలపోసుకుంటూ ఉండటమే. 'కాబట్టి మీరు ఈ నా

మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని... నీవు నీ యింట

కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనునప్పుడు, లేచునప్పుడు

వాటిని గూర్చి మాటలాడుచు... (ద్వితీయో. 11:18, 19). ఇలా చేయడమే మనం

దేవుని సన్నిధిలో నిత్యము ఉండటం. 'అవసరమైనది ఒక్కటే' అని యేసు చెప్పింది

కూడా అదే. మరి దేవుని సన్నిధిని నిత్యము వెదకటానికి నీవు సిద్ధమా?

ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము ఈ లోకానుసారంగా

జీవించకుండా నిత్యము నీ సన్నిధిని వెదకునట్లు మాకు సహాయం దయచేయుమని

యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

*దేవుని ఉగ్రత దినము రాకమునుపే*


'అయ్యా, మీరు నశించిపోతారు, మీకు శిక్ష వస్తుంది, నా మాట వినండి, ప్లీజ్' అని దేవుడు మనుష్యులను బతిమాలుకోవాల్సిన ఖర్మ దేవునికి ఎందుకు? అవిధేయులైన ప్రజలను ఒక్క క్షణములో నాశనము చేయగల (సంఖ్యా. 16:21,45) శక్తిగల దేవుడు తన ఉగ్రతను చూపకుండా తనను తాను తగ్గించుకొని లోబడనొల్లని, పనికిమాలిన మనుష్యుల కోసం ఎందుకు ఇంతగా ప్రాకులాడుతున్నాడు? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయన బిడ్డే. తల్లిదండ్రులను హింసించే కన్నబిడ్డలను చంపుకోవాలని ఏ తల్లితండ్రులకు ఉండదు కదా! ఒకవేళ సహనం నశిస్తే వాళ్ళైనా

బిడ్డలను చంపుకుంటారేమో గాని, తల్లి విడిచినా, తండ్రి విడిచినా మనల్ని ఎడబాయని దేవుడు మనల్ని ఎందుకు చంపుకుంటాడు.

కాలుతుందని తెలియని పసిపిల్లలు నిప్పు పట్టుకోబోతుంటే మనం చూస్తూ ఊరుకోము కదా! అలాగే పాపమునకు జీతము మరణము అని తెలియని వారిని రక్షించుకోడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. షుగరు వ్యాధి ఉన్నవారు శరీరానికి గాయం కాకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఏదైనా గాయమైతే అది త్వరగా మానదు. ఒకవేళ కాలికో,

చేతికో ఏదైనా గాయమై ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే గాయమైన ఆ భాగాన్ని శరీరం నుండి తొలగిస్తారు. లేదంటే అది శరీరమంతా ప్రాకి మనిషి చనిపోతాడు.

అలాగే పాపము చేసేవారు మారడానికి దేవుడు ఎన్ని అవకాశాలిచ్చినా మారకపోతే దేవుడు వారిని లేపేస్తాడు. లేదంటే వారి వలన మిగతా సమాజం కూడా చెడిపోతుంది.

దుర్మార్గమైన పనులు చేస్తూ అమాయకులైన వారిని బాధపెట్టినప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. అంతమాత్రాన దేవుడు వెంటనే శిక్షించడు. చేసిన తప్పుకి శిక్ష వెంటనే రాకపోవడం వలన మనుష్యులు హృదయపూర్వకంగా తప్పులు చేస్తూనే ఉంటారు. "దుష్ క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు

భయము విడిచి హృదయపూర్వకముగా దుష్ క్రియలు చేయుదురు” (ప్రసంగి 8:11).

ఇలాంటి వారిని దేవుడు ఉపేక్షించడు. వారి మీద తన ఉగ్రతను కుమ్మరించి వారిని, వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు దేవుడు నిద్రపోడు. మనం చేసే పాపాలకు శిక్ష వెంటనే రాకపోవడం వలన ఇంకా ఎక్కువగా పాపాలు చేసుకుంటూ పోతే

దేవుని ఉగ్రతకు గురి అవుతాము. ఆ దినము రాకముందే, దేవుని యొద్ద నుండి శిక్ష రాకముందే, మన పాపజీవితాన్ని విడిచి దేవుని దగ్గరకు వస్తే రక్షింపబడతాము.

ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము పాపములు చేసి నీ ఉగ్రతకు గురి కాకుండా మారుమనస్సు పొందులాగున మాకు సహాయం దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

*యథార్ధ హృదయముతో జీవించుట*

దేవుడు మనుష్యుల నుండి కోరుకొనేది యథార్ధహృదయంతో జీవించటం.

యథార్ధంగా జీవించడమంటే మన హృదయంలో మోసం, కుట్ర, అబద్ధం, లోపల

ఒక అభిప్రాయం ఉంచుకొని, పైకి దానికి భిన్నంగా ఉండటంలాంటివి లేకుండా

జీవించగలగటం. 'హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి

కలది' (యిర్మీయా 17:9) అని చెప్పబడిన ప్రకారం ఈ మోసకరమైన హృదయాన్ని

యథార్ధంగా ఉంచుకోవడమంటే చాలా కష్టం. మనుష్యులు అభద్రతా భావంతో,

అనుక్షణం భయపడుతూ జీవించడానికి యథార్ధత లేకపోవడమే కారణం. దేవుడు

లేని జీవితాలలో యథార్ధత అనేది భూతద్దం పెట్టి వెదికినా కనబడదు. మనుష్యులు

యథార్ధంగా ఉండలేకపోవడానికి కారణం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ,

శరీరాశలను నెరవేర్చుకోవడం కోసం వివిధ తంత్రములు కల్పించుకోవడమే. 'దేవుడు

నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు

కల్పించుకొని యున్నారు' (ప్రసంగి 7:29). దేవుడు మనిషిని యథార్ధంగా పుట్టించిన

తర్వాత ఆ యథార్ధతని నిలుపుకోవాల్సి బాధ్యత మనిషిదే. మనం ఈ భూమి మీద

జీవించే స్వల్పకాలం మనం యథార్ధంగా జీవించకుండా పాపపు జీవితం జీవించి

అష్టకష్టాలు తెచ్చుకోవడమన్నది అది స్వయంకృతాపరాధమే. కేవలం ఈ భూమి

మీద సుఖవంతమైన జీవితం జీవించడానికి మన యథార్ధతని ఫణంగా పెట్టడమంటే

నరకానికి రాజమార్గం వేసుకున్నట్లే. యోబుకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, స్వయంగా

భార్యే వచ్చి 'ఇంకా నువ్వు నీ యథార్ధతను విడువవా?” అని చెప్పినప్పటికీ తన

యథార్ధతను వదలలేదు. దేవుడు యోబు యొక్క యథార్ధత గురించి సాతాను దగ్గర

ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. యోబు కేవలం మనలాంటి మనిషే, ఆయనకేమి

అతీంద్రియ శక్తులు లేవు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్ధతని వదలకుండా

వుండటానికి కారణం, దేవుడంటే ఆయనకి ఉన్న ప్రేమ, భయభక్తులు, నమ్మకం

ఆయన యొక్క విశ్వాసాన్ని, నీతినిజాయితిని, యథార్ధతను నిలబెట్టాయి. ఆయన

తన బిడ్డలు, ఆస్తిపాస్తుల కంటే తన యథార్ధత కాపాడుకోడానికి ఎక్కువ ప్రాధాన్య

మిచ్చాడు. మనమెందుకు యోబులా యథార్ధంగా జీవించలేకపోతున్నామంటే, ఈ

లోకంలో యథార్ధంగా జీవించడం కంటే ధనసంపాదనే మన లక్ష్యం కాబట్టి.

యథార్ధ హృదయుల కోసం విత్తబడియున్న ఆనందాన్ని నీవు పొందుకోవాలంటే,

యథార్ధమైన జీవితం జీవించడానికి హృదయపూర్వకంగా సిద్ధపడాలి.

ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మా హృదయములను యథార్ధంగ ఉంచుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించునట్లు మాకు సహాయం దయచేయుమని

యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

*దేవుని మాట వినకపోతే ఏ మేలు కలుగదు...*

ఒక్కొసారి మనల్ని చూచి మనం చాలా దిగులుపడతాము. “ఏంటి ఈ జీవితం,

ఇన్ని కష్టాలు, బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి' అని చాలా బాధపడిపోతామే

కాని అవన్నీ మనకు రావడానికి గల కారణాలు గురించి ఆలోచించము. అందుకు

మూలము ఏంటో మనకు తెలీక తెగ గింజుకుంటాము. మనకి ఏ కష్టం వచ్చినా,

బాధ వచ్చినా అవి మనకు దేవుని దగ్గర నుండే వస్తాయి. ఈ కష్టాలు, బాధలు

రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, దేవునికి అవిధేయగా జీవిస్తూ

మనం చేసే పాపాలకు శిక్షగా వస్తాయి. రెండు, మనం దేవుని బిడ్డలుగా

జీవిస్తున్నప్పుడు మనల్ని పరీక్షించడం ద్వారా విశ్వాసంలో బలపడటానికి వస్తాయి.

ఎటొచ్చీ ఈ కష్టాలు,

బాధలు వచ్చినప్పుడు బెంబేలెత్తి భయపడిపోయేది దేవునికి

అవిధేయతగా ఉండేవారే తప్ప దేవుని బిడ్డలకి అలాంటి పరిస్థితి ఉండదు. మనకి

ఎప్పుడైనా కష్టమోచ్చినా, బాధవచ్చినా దేవునికి వ్యతిరేకమైన పని ఏమైనా చేశామేమో

అని పరీక్షించుకోవాలి. దేవుని మాట వినకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించని

వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు చెప్పాడు. 'మీరు నా మాట వినక, నా

ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడలను... మీ కన్నులను

క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును, క్షయ

రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు

వ్యర్ధములగును... నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల యెదుట మీరు

చంపబడెదరు' (లేవీయ. 26:14-17). దేవుని మాట వినకపోవడం వలన వచ్చే

ఇలాంటి కష్టాలు, బాధలు ఎంత భయంకరంగా ఉంటాయో 26వ అధ్యాయం

మొత్తం చదివితే తెలుస్తుంది. ఈ భూమి మీద జీవించే తాత్కాలికమైన జీవితాన్ని

ఇలాంటి శ్రమలతో జీవిస్తే ఇంక దేవుడిచ్చిన ఈ విలువైన జీవితానికి అర్ధం

ఏముంటుంది? 'నా మాట విను' అని మన పిల్లలతో మనం ఎందుకు చెప్తాము?

వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే కదా! దేవుడు కూడా 'నా మాట వినండి' అని మన

భవిష్యత్ బాగుండాలనే చెప్తాడు తప్ప మనం కష్టాలు, బాధలు పడాలని కాదు.

దేవుని మాట వింటే దేవుడు మనకి ఎలాంటి మేలులు చేస్తాడన్నది లేవీయకాండము

26:3-13లో చెప్పాడు. అది ఒకసారి క్షుణ్ణంగా చదివి మీరు దేవుని మాట వింటారో

లేదా మీ ఇష్ట ప్రకారం జీవిస్తారో నిర్ణయం తీసుకోవాల్సింది మీరే.

ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ మాట విని, నీ

ఇష్టప్రకారం జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసయ్య నామమున

అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.