దేవుడు మనుష్యుల నుండి కోరుకొనేది యథార్ధహృదయంతో జీవించటం.
యథార్ధంగా జీవించడమంటే మన హృదయంలో మోసం, కుట్ర, అబద్ధం, లోపల
ఒక అభిప్రాయం ఉంచుకొని, పైకి దానికి భిన్నంగా ఉండటంలాంటివి లేకుండా
జీవించగలగటం. 'హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి
కలది' (యిర్మీయా 17:9) అని చెప్పబడిన ప్రకారం ఈ మోసకరమైన హృదయాన్ని
యథార్ధంగా ఉంచుకోవడమంటే చాలా కష్టం. మనుష్యులు అభద్రతా భావంతో,
అనుక్షణం భయపడుతూ జీవించడానికి యథార్ధత లేకపోవడమే కారణం. దేవుడు
లేని జీవితాలలో యథార్ధత అనేది భూతద్దం పెట్టి వెదికినా కనబడదు. మనుష్యులు
యథార్ధంగా ఉండలేకపోవడానికి కారణం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ,
శరీరాశలను నెరవేర్చుకోవడం కోసం వివిధ తంత్రములు కల్పించుకోవడమే. 'దేవుడు
నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు
కల్పించుకొని యున్నారు' (ప్రసంగి 7:29). దేవుడు మనిషిని యథార్ధంగా పుట్టించిన
తర్వాత ఆ యథార్ధతని నిలుపుకోవాల్సి బాధ్యత మనిషిదే. మనం ఈ భూమి మీద
జీవించే స్వల్పకాలం మనం యథార్ధంగా జీవించకుండా పాపపు జీవితం జీవించి
అష్టకష్టాలు తెచ్చుకోవడమన్నది అది స్వయంకృతాపరాధమే. కేవలం ఈ భూమి
మీద సుఖవంతమైన జీవితం జీవించడానికి మన యథార్ధతని ఫణంగా పెట్టడమంటే
నరకానికి రాజమార్గం వేసుకున్నట్లే. యోబుకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, స్వయంగా
భార్యే వచ్చి 'ఇంకా నువ్వు నీ యథార్ధతను విడువవా?” అని చెప్పినప్పటికీ తన
యథార్ధతను వదలలేదు. దేవుడు యోబు యొక్క యథార్ధత గురించి సాతాను దగ్గర
ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. యోబు కేవలం మనలాంటి మనిషే, ఆయనకేమి
అతీంద్రియ శక్తులు లేవు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్ధతని వదలకుండా
వుండటానికి కారణం, దేవుడంటే ఆయనకి ఉన్న ప్రేమ, భయభక్తులు, నమ్మకం
ఆయన యొక్క విశ్వాసాన్ని, నీతినిజాయితిని, యథార్ధతను నిలబెట్టాయి. ఆయన
తన బిడ్డలు, ఆస్తిపాస్తుల కంటే తన యథార్ధత కాపాడుకోడానికి ఎక్కువ ప్రాధాన్య
మిచ్చాడు. మనమెందుకు యోబులా యథార్ధంగా జీవించలేకపోతున్నామంటే, ఈ
లోకంలో యథార్ధంగా జీవించడం కంటే ధనసంపాదనే మన లక్ష్యం కాబట్టి.
యథార్ధ హృదయుల కోసం విత్తబడియున్న ఆనందాన్ని నీవు పొందుకోవాలంటే,
యథార్ధమైన జీవితం జీవించడానికి హృదయపూర్వకంగా సిద్ధపడాలి.
ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మా హృదయములను యథార్ధంగ ఉంచుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించునట్లు మాకు సహాయం దయచేయుమని
యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
No comments:
Post a Comment