Sunday, August 1, 2021

*మనం దేవున్ని నమ్మకపోతే...*

దేవున్ని 'నమ్ముట నీ వలన అయితే' అంటే, నమ్మడమనే ప్రక్రియ ఎంత కష్టమైనదో

మనం అర్ధం చేసుకోవాలి. మనుష్యులను నమ్మినంత తేలిగ్గా మనం దేవున్ని నమ్మలేము.

దేవుడు కనబడడు కాబట్టి ఆయన్ని హృదయపూర్వకంగా నమ్మడమంటే చాలా గొప్ప

విషయం. నేను దేవున్ని నమ్ముతున్నాను అని చెప్పేవారు ఇంక ఏ గత్యంతరం లేక చివరి

ప్రయత్నంగా దేవున్ని నమ్ముతారే తప్ప ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించి మాత్రము

కాదు. ఒకవేళ దేవుడు ఉన్నాడు అని మనం హృదయపూర్వకంగా నమ్మితే, ఆయన

మనల్ని చూస్తున్నాడని నమ్మాలి. మనల్ని చూస్తున్నాడంటే, మన కష్టాలు, బాధలు,

సమస్యలని కూడా చూస్తున్నాడని నమ్మాలి. దేవుడు చూస్తున్న వాటి గురించి మనం

బాధపడటం వలన మనకేం ప్రయోజనం. ఒకవేళ ఆ బాధలు, కష్టాలు మన స్వయం

కృతాపరాధం అయితే పశ్చాత్తాపపడి, మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర

క్షమాపణ అడిగితే దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. 'మన

పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును

నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి

మనలను పవిత్రులనుగా చేయును' (1యోహాను 1:9). మన పాపములు క్షమింప

బడినప్పుడు మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మన ప్రమేయమేమి

లేకుండా మనల్ని పరీక్షించడానికి దేవుడే కష్టాలు, బాధలు పెడితే, అవి పెట్టిన ఉద్దేశ్యం

నెరవేరగానే దేవుడే తీసేస్తాడు. అప్పటి దాకా ఓర్పుతో సహనముతో కనిపెట్టుకొని

ఉండాలి. ఇదంతా దేవున్ని నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం దేవున్ని

నమ్మకపోతే మనకి వచ్చే కష్టాలు, బాధలు తొలగించుకోడానికి మనుష్యులను

ఆశ్రయించాల్సి వస్తుంది. కొన్ని కష్టాలు తొలగించడం మనుష్యులకు కూడా సాధ్యము

కాదు. అనేకమంది వారికున్న కష్టాలు తొలగించుకోలేక నానా యిబ్బందులు

పడుతుంటారు. అలా ఇబ్బందులు పడుతూనే జీవితాన్ని వెళ్ళదీస్తారు కానీ, దేవుని

దగ్గరకు వచ్చి తమ ఇబ్బందులు తొలగించుకోడానికి వారికి మనస్సు రాదు. ఈ

లోకానుసారమైన మనస్సు ఉన్న వారు మాత్రమే దేవున్ని నమ్మక ఆయన దగ్గరకు

రాలేరు. 'ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు

రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును' (మత్తయి 11:28) అని పిలుస్తున్న దేవుని

నమ్మి ఆయన దగ్గరకు రావడము నీ వలన అయితే, నీ కష్టాలను, బాధలను, సమస్యలను

తీసివేసుకోడానికి నీకు సాధ్యమవుతుంది. నీవు దేవున్ని నమ్మకపోతే నీ కష్టాలకు,

బాధలకు, సమస్యలకు నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నిన్ను నమ్మి, నీ మీద

ఆధాపడి జీవించే శక్తిని, ధైర్యాన్ని, మనసును మాకు అనుగ్రహించుమని యేసయ్య

నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

No comments:

Post a Comment