'అయ్యా, మీరు నశించిపోతారు, మీకు శిక్ష వస్తుంది, నా మాట వినండి, ప్లీజ్' అని దేవుడు మనుష్యులను బతిమాలుకోవాల్సిన ఖర్మ దేవునికి ఎందుకు? అవిధేయులైన ప్రజలను ఒక్క క్షణములో నాశనము చేయగల (సంఖ్యా. 16:21,45) శక్తిగల దేవుడు తన ఉగ్రతను చూపకుండా తనను తాను తగ్గించుకొని లోబడనొల్లని, పనికిమాలిన మనుష్యుల కోసం ఎందుకు ఇంతగా ప్రాకులాడుతున్నాడు? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయన బిడ్డే. తల్లిదండ్రులను హింసించే కన్నబిడ్డలను చంపుకోవాలని ఏ తల్లితండ్రులకు ఉండదు కదా! ఒకవేళ సహనం నశిస్తే వాళ్ళైనా
బిడ్డలను చంపుకుంటారేమో గాని, తల్లి విడిచినా, తండ్రి విడిచినా మనల్ని ఎడబాయని దేవుడు మనల్ని ఎందుకు చంపుకుంటాడు.
కాలుతుందని తెలియని పసిపిల్లలు నిప్పు పట్టుకోబోతుంటే మనం చూస్తూ ఊరుకోము కదా! అలాగే పాపమునకు జీతము మరణము అని తెలియని వారిని రక్షించుకోడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. షుగరు వ్యాధి ఉన్నవారు శరీరానికి గాయం కాకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఏదైనా గాయమైతే అది త్వరగా మానదు. ఒకవేళ కాలికో,
చేతికో ఏదైనా గాయమై ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే గాయమైన ఆ భాగాన్ని శరీరం నుండి తొలగిస్తారు. లేదంటే అది శరీరమంతా ప్రాకి మనిషి చనిపోతాడు.
అలాగే పాపము చేసేవారు మారడానికి దేవుడు ఎన్ని అవకాశాలిచ్చినా మారకపోతే దేవుడు వారిని లేపేస్తాడు. లేదంటే వారి వలన మిగతా సమాజం కూడా చెడిపోతుంది.
దుర్మార్గమైన పనులు చేస్తూ అమాయకులైన వారిని బాధపెట్టినప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. అంతమాత్రాన దేవుడు వెంటనే శిక్షించడు. చేసిన తప్పుకి శిక్ష వెంటనే రాకపోవడం వలన మనుష్యులు హృదయపూర్వకంగా తప్పులు చేస్తూనే ఉంటారు. "దుష్ క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు
భయము విడిచి హృదయపూర్వకముగా దుష్ క్రియలు చేయుదురు” (ప్రసంగి 8:11).
ఇలాంటి వారిని దేవుడు ఉపేక్షించడు. వారి మీద తన ఉగ్రతను కుమ్మరించి వారిని, వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు దేవుడు నిద్రపోడు. మనం చేసే పాపాలకు శిక్ష వెంటనే రాకపోవడం వలన ఇంకా ఎక్కువగా పాపాలు చేసుకుంటూ పోతే
దేవుని ఉగ్రతకు గురి అవుతాము. ఆ దినము రాకముందే, దేవుని యొద్ద నుండి శిక్ష రాకముందే, మన పాపజీవితాన్ని విడిచి దేవుని దగ్గరకు వస్తే రక్షింపబడతాము.
ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము పాపములు చేసి నీ ఉగ్రతకు గురి కాకుండా మారుమనస్సు పొందులాగున మాకు సహాయం దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
No comments:
Post a Comment