చాలామంది ధైర్యంగా జీవించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ధైర్యంగా
జీవించడానికి ఏదో ఒక ఆసరా కావాలి. కొంతమంది వారికున్న ఉద్యోగాన్ని బట్టి,
కొంతమంది వ్యాపారాన్నిబట్టి, వారికున్న ఆస్తిపాస్తులను బట్టి ధైర్యంగా జీవిస్తుంటారు.
ఎంత డబ్బు ఉంటే అంత ధైర్యంగా జీవించవచ్చనేది ప్రతి ఒక్కరి నమ్మకం. అయినప్పటికీ
వారి ధైర్యం శాశ్వతం కాదు. ఉద్యోగం ఊడిపోవచ్చు, వ్యాపారంలో నష్టంరావచ్చు,
ఆస్తిపాస్తులు కరిగిపోవచ్చు.
కాబట్టి మళ్ళీ వారు భయపడటం మొదలుపెట్టాల్సిందే.
పూర్వకాలంలో రాజులు శత్రుసైన్యం నుండి వారిని కాపాడుకోడానికి వారి కోట చుట్టూ
పెద్ద గోడ కట్టుకొని దాని మీద కాపలవారిని పెట్టి ధైర్యంగా ఉండేవారు. అయినప్పటికీ
శత్రుసైన్యం ఆ గోడను పడగొట్టగలరు. కాబట్టి ఆ గోడ వారికేమి రక్షణ కల్పించలేదు.
'యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని
యుండుట వ్యర్ధమే' (కీర్తనలు 127:1). మన పరిస్థితి కూడా అంతే మనం ధైర్యంగా
జీవించడానికి మనం కల్పించుకొనే వివిధ తంత్రాలు మనల్ని కాపాడలేవు. మన చడువు,
ఉద్యోగం, వ్యాపారం, ఆస్తిపాస్తులు ఏ ఒక్కటి మన ధైర్యాన్ని నిలబెట్టలేదు. కేవలం
దేవునియందలి భయభక్తులు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలదు. 'యెహోవాయందు
భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును' (సామెతలు 14:26).
ఎంత ధైర్యం పట్టిస్తుందంటే బాలుడైన
దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును
చంపగలిగేటంత. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడి చనిపోవడానికి సిద్ధపడి
రాజును ఎదిరించగలిగినంత. దానియేలు సింహాలబోనులో పడటానికి వెనుకాడనంత
ధైర్యం. వీటిని ఎదుర్కోడానికి వారికి ఏమాత్రం శక్తి లేకపోయినా దేవున్నిబట్టి భయపడ
కుండా అత్యంత ధైర్యంతో ఎదుర్కొన్నారు. వారు కేవలం మనలాంటి శరీరమున్న మనుష్యులే.
అంతటి ధైర్యం కేవలం దేవున్నిబట్టి మాత్రమే వస్తుంది తప్ప మనం ఏర్పరచుకొనే
తంత్రాలు మనకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేవు. మన జీవితంలో కూడా సింహము,
ఎలుగుబంటి, గొల్యాతు, అగ్నిగుండమంతటి బలమైన సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి.
మీరు మీ జీవితంలో ఏ విషయమై భయపడుతున్నారు? ఆర్ధికపరమైన సమస్యలా,
కుటుంబపరమైన సమస్యలా, ఆరోగ్యపరమైన సమస్యలా, ఏ సమస్యలైనా సరే, దేవున్ని
నమ్మి, ఆయనయందు భయభక్తులు కలిగివుంటే మీరు బహు ధైర్యము తెచ్చుకొని
వాటిని ఎదుర్కోవడమే కాకుండా వాటి నుండి విముక్తి కూడా పొందగలరు. మరి
దేవునియందు భయభక్తులు కలిగి ఉండటానికి మీరు సిద్ధమేనా?
ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము ధైర్యంగా ఉండటానికి
నీయందు భయభక్తులు కలిగి జీవించునట్లు నీ కృప అనుగ్రహించుమని యేసయ్య
నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
No comments:
Post a Comment