Sunday, August 1, 2021

*మనం నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు*

అన్యాయము చేయడం, మోసం చేయడం అనేది మనుష్యుల మధ్యలో జరిగే ప్రక్రియ.

చాలామంది వారికి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడని

తిట్టుకుంటుంటారు. 'స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను

మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను' (యెషయా 49:15)

అని చెప్పిన దేవుడు అన్యాయం చేస్తాడా? తల్లిదండ్రులైనా అన్యాయం చేస్తారేమో కాని

దేవుడు అన్యాయం చేస్తాడనుకుంటే మనమే అన్యాయస్తులమవుతాము. దేవుడు చెప్పిన

మార్గములో నడవకుండా మనిష్టానుసారంగా జీవించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకొని

దేవున్ని నిందించడం ఎంతవరకు సబబు. ఒకవేళ నీతినిజాయితీగా జీవిస్తున్నా సరే

మనకి కష్టం వచ్చినప్పుడు నిందించడానికి యోబుకి వచ్చినంతకంటే ఎక్కువ కష్టాలు

మనకి వస్తాయా? ఆస్తిపాస్తులను, కన్నబిడ్డలను, ఆరోగ్యాన్ని, సర్వస్వం కోల్పోయిన

తర్వాత కూడా యోబువలె 'మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును

మనము అనుభవింప తగదా' అని అనుకొనే స్థాయి మనకు ఎలాగు రాదు, కనీసం

మన కష్టాలు తీసెయ్యమని దేవున్ని వేడుకోకుండా తిరిగి దేవున్నే నిందిస్తే దేవుని

కోపాగ్ని తుదముట్టకు మన మీదికి వస్తుంది. ఈ లోకభోగాలు అనుభవించడానికి

మనం చేసే అన్యాయాలు, అక్రమాలకి వచ్చే శిక్షల నుండి దేవుడు మనల్ని తప్పించాలని

అనుకోవడమే అన్యాయం. 'అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము

కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది' (యెహెజ్కేలు

33:17). ఐగుప్తుదేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులు తమ్మును

విడిపించమని గగ్గోలు పెట్టి దేవున్ని ప్రార్ధించారు. మోషేని పంపించి, ఐగుప్తు దేశములో

ఎన్నో అద్భుతాలు చేసి, ఐగుప్తీయుల నుండి వారికి ఎంతో ఆస్తి ఇప్పించి, పాలుతేనెలు

ప్రవహించే కనాను దేశాన్ని ఇవ్వడానికి వారిని బయటకు తీసుకొచ్చిన దేవుడు

అన్యాయస్తుడా? వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు చేసిన అద్భుత

కార్యాలను మరచి దారి పొడుగునా తిండి కావాలని, నీళ్ళు కావాలని, మాంసం

కావాలని, దేవుని మీద సణుగుకున్న ఇశ్రాయేలీయులు అన్యాయస్తులా? దేవున్ని

నిందించిన ప్రతి ఒక్కరూ అరణ్యంలోనే చచ్చారు. మనకి కష్టం వచ్చినప్పుడు 'కీడును

మనము అనుభవింప తగదా' అని అనుకొనేంత పెద్ద మనసులేకపోయినా పరవాలేదు

కానీ, మన అవిధేయత వలన వచ్చే శిక్ష నుండి తప్పించమని దేవున్ని ప్రార్ధిస్తే

దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు.

ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలము మా అవిధేయత

వలన వచ్చే కష్టనష్టాలు, బాధల నుండి మమ్మల్ని తప్పించమని యేసయ్య నామమున

అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

No comments:

Post a Comment